అంతరిక్షంలో శాటిలైట్లను లక్ష్యంగా చేసుకున్న దాడులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంటర్నెట్, జీపీఎస్, బ్యాంకింగ్, రక్షణ సమాచార వ్యవస్థలు, వాతావరణ హెచ్చరికలు వంటి కీలక సేవలు ఉపగ్రహాలపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో, వీటిపై జరిగే దాడులు ప్రపంచ భద్రతకు కొత్త సవాలుగా మారుతున్నాయి. రష్యా, చైనా వంటి దేశాలు అంతరిక్ష సైనిక సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తుండటంతో ‘శాటిలైట్ కిల్లర్’ టెక్నాలజీలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి 24కు కొద్ది గంటల ముందే, ఉక్రెయిన్‌తో పాటు మధ్య యూరప్‌లోని వేలాది శాటిలైట్ మోడెమ్లపై భారీ సైబర్ దాడి జరిగింది. ఈ దాడి వల్ల సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడగా, ఉక్రెయిన్ సైనిక కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని బలహీనపర్చడమే ప్రధాన ఉద్దేశమని అంతరిక్ష భద్రతా నిపుణులు విశ్లేషించారు. ఈ ఘటనతో అంతరిక్ష యుద్ధం సైబర్ దాడుల రూపంలో కూడా ఎంత ప్రమాదకరంగా మారిందో ప్రపంచం గుర్తించింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉపగ్రహాలను ధ్వంసం చేసే క్షిపణులు, జామింగ్ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, సైబర్ దాడులు వంటి సాంకేతికతలు భవిష్యత్తు యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ (స్పేస్ ఎకానమీ) విలువ వందల బిలియన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో, ఉపగ్రహాల భద్రతను కాపాడేందుకు అంతర్జాతీయ సహకారం, ఆధునిక రక్షణ వ్యవస్థలు మరింత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.