వేదావతి ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్.. 80 వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

కర్నూలు జిల్లాలోని వేదావతి ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శిరి పరిశీలించారు. హాలహర్వి మండలం అమృతాపురం గ్రామ సమీపంలో వేదావతి నది పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్‌కు ఇంజనీర్లు ప్రాజెక్టు పురోగతిపై వివరాలు అందించారు. ఈ పర్యటనలో టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి కూడా పాల్గొన్నారు.

ప్రాజెక్టు కింద హాలహర్వి సమీపంలో రెండు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్, మొలగవల్లి సమీపంలో లిఫ్ట్ ద్వారా మరో ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసే ప్రతిపాదన ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 500 ఎకరాల భూసేకరణకు నిధులు కేటాయించగా, మొత్తం ప్రాజెక్టు కోసం సుమారు 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అదనంగా 600 ఎకరాలు అత్యవసరమని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖామర్ వివరించారు.

వేదావతి ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేసే దిశగా పనులు కొనసాగుతున్నాయని జిల్లా అధికారులు, టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి వెల్లడించారు.