BCCI చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్? అగార్కర్ స్థానంలో కీలక మార్పుపై చర్చలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించే అంశంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

చీఫ్ సెలెక్టర్ పదవికి వీవీఎస్ లక్ష్మణ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్‌సీఏ బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్‌కు భారత క్రికెట్ వ్యవస్థతో పాటు యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించడంలో విస్తృత అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీకి ఆయనను తీసుకురావడంపై బీసీసీఐలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అగార్కర్ స్థానంలో లక్ష్మణ్ నియామకంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చీఫ్ సెలెక్టర్ అంశంపై తుది నిర్ణయాన్ని సెప్టెంబర్‌లో తీసుకునే అవకాశం ఉందని సమాచారం. బీసీసీఐ అధికారికంగా నిర్ణయం ప్రకటించిన తర్వాతే ఈ మార్పుపై స్పష్టత రానుంది.