భారతీయ సినిమా చరిత్రలో ‘సూపర్ స్టార్’, ‘యాక్షన్ హీరో’, ‘పాన్ ఇండియా స్టార్’ వంటి పదాలు కొత్తగా అనిపించినా.. దశాబ్దాల క్రితమే ఓ తెలుగువాడు బాలీవుడ్లో యాక్షన్ హీరోగా తనదైన ముద్ర వేశారు. కత్తిసాములు, గుర్రపు స్వారీలు చేస్తూ అప్పటి ప్రేక్షకులను అలరించిన పైడి జైరాజ్ తెలంగాణ గడ్డపై జన్మించి ముంబై వెండితెరపై తన సత్తా చాటారు. ఎన్టీఆర్, కాంతారావు వంటి ప్రముఖులు సినీ రంగంలోకి రాకముందే ఆయన హిందీ చిత్ర పరిశ్రమలో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందారు.
1909 సెప్టెంబర్ 28న సిరిసిల్లలో జన్మించిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో బీఎస్సీ చదువుతున్న సమయంలో నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. సరోజిని నాయుడు భర్త గోవిందరాజుల నాయుడు ప్రోత్సాహంతో నటన వైపు అడుగులు వేశారు. సినీ అవకాశాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ బొంబాయి చేరుకున్న ఆయన.. యంగ్ ఇండియా పిక్చర్స్ సంస్థలో నెలకు కేవలం మూడు రూపాయల జీతంతో పనిచేశారు. లైట్‌బాయ్‌గా, అసిస్టెంట్ కెమెరామెన్‌గా, డూప్‌గా వివిధ పనులు చేస్తూ సినిమా పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
1929లో ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే సైలెంట్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన పైడి జైరాజ్ ఆ తర్వాత ‘షికారి’, ‘జగమత్ జవాని’ వంటి చిత్రాలతో టాకీ సినిమాల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు, గుర్రపు స్వారీ, కత్తిసాముల్లో నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ నుంచి ముంబై వెళ్లి హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన జైరాజ్ భారతీయ సినిమా చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు.