జపాన్‌లో టోమహాక్ క్షిపణుల పరీక్షలు.. ఉత్తరకొరియా తీవ్ర హెచ్చరిక

తూర్పు ఆసియాలో సైనిక ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జపాన్‌లో అమెరికా టోమహాక్ క్షిపణుల పరీక్షలపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్తరకొరియా.. ఈ చర్యలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆరోపించింది.

జపాన్ సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతిగా తాము కూడా అదనపు సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా హెచ్చరించింది. జపాన్ చర్యలు తమ భద్రతా ప్రయోజనాలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో తూర్పు ఆసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, వర్కర్స్ పార్టీ కీలక నేత కిమ్ యో జోంగ్ ఆగస్టు 5న ఈ మేరకు ప్రకటన విడుదల చేసినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. జపాన్ సైనిక విస్తరణకు ప్రతిస్పందనగా తమ దేశం తగిన చర్యలు తీసుకుంటుందని ఆమె స్పష్టం చేసినట్లు తెలిపింది. తాజా హెచ్చరికల నేపథ్యంలో జపాన్, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.