సత్తెనపల్లి: పట్టణంలోని వావిలాల కాంప్లెక్స్‌లో ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సరైన వర్షాలు కురవక వరి సాగు చేసే పరిస్థితులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లోనూ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్నామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ప్రజలకు మంచి బియ్యం అందించడమే కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.