రాష్ట్రంలో కరోనా అధికంగా ప్రబలకపోవచ్చని అనుకుంటున్నం. అయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు ఈ వ్యాధి పాకింది. ఇది సోకని దేశమంటూ లేదని వార్తలొస్తున్నాయి. మన దగ్గర విదేశాల నుంచి వచ్చిన వారికి, వారు తిరిగిన చోట ఇతరులకు వ్యాధి సంక్రమించి ఉండొచ్చని అనుమానాలుండటంతో మొత్తం 19,313 మందిని హోం ఐసోలేషన్‌లో పెట్టి నిఘా ఉంచాం. వీళ్లలో కొంత మంది తప్పించుకుపోతున్నారు. ఒక వ్యక్తి నిర్మల్‌లో మూడుసార్లు తప్పించుకుని పోయాడు. వీళ్లను నియంత్రించేందుకు వీరి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించాం. ఇంకా కూడా బుద్ధిలేని పనిచేస్తే వారి పాస్‌పోర్టును సస్పెండ్ చేయిస్తాం. పౌర సమాజానికి శత్రువులుగా పరిణమించిన వారు పౌర సదుపాయాలు పొందడానికి అర్హులు కారు.. సమాజ శ్రేయస్సును భంగం కలిగిస్తామంటే సమాజం నుంచి లభించే ప్రయోజనాలు పొందే అర్హత లేదు. నిర్ధాక్షిణ్యంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరాం.