రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులు..

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రూ.400 కోట్ల వ్యయంతో 1,050 అధునాతనమైన కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయిం తీసుకున్నట్లు చెప్పారు.

 

కొత్తగా 512 పల్లెవెలుగు, 400 ఎక్స్‌ప్రెస్, 92 లహరీ స్లీపర్ కమ్ సీటర్, 56 రాజధాని ఏసీ బస్సులను సంస్థ కొనుగోలు చేయనున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో 540, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. 2024 మార్చి నాటికి విడతల వారిగా అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ఎండీ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాలక్ష్మి పథకం వలన బస్సుల్లో రద్దీ పెరిగిందని.. అందుకోసం కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

 

‘‘అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వాడకంలోకి వస్తాయి. వాటిలో 30 రాజధాని ఏసీ, 30 ఎక్స్‌ప్రెస్‌, 20 లహరీ స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి. ఈ కొత్త బస్సులను హైదరాబాద్.. ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తాం. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు’’ అని సజ్జనార్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *