ఎక్కడి వారు అక్కడే 21 రోజులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా మంగళవారం రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. 21 రోజులు ఎక్కువేనన్న సంగతి తనకూ తెలుసునని… కానీ మనల్ని, మన కుటుంబాల్ని రక్షించుకోవటానికి ఇంతకన్నా మార్గం లేదని ఆయన స్పష్టంచేశారు. ‘‘బాగా అభివృద్ధి చెంది, అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో సైతం ఇది బీభత్సం సృష్టిస్తోంది. దీన్ని నివారించడానికి నిపుణులు చెబుతున్న మార్గం ఒక్కటే. అది సామాజిక దూరం. మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా… విదేశాల నుంచి రాలేదు కదా అని ఈ దూరం పాటించక్కరలేదనుకుంటే పొరపాటే. ఎందుకంటే కరోనా వచ్చిన వ్యక్తులు చాలా రోజుల పాటు మామూలుగానే ఉంటున్నారు. లక్షణాలు కొన్ని రోజుల తరవాతే బయటపడుతున్నాయి. అందుకే దాన్ని ఆపలేకపోతున్నాం. ఈ లోపే అది వారి నుంచి మరికొందరికి వ్యాపించేస్తోంది. కాబట్టి ఈ వలయాన్ని అడ్డుకోవాలి. దానికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. 21 రోజుల పాటు ఇంట్లో ఉండండి… ఇంట్లోనే ఉండండి. మీరే కాదు. నేను  దీన్ని పాటించాల్సిందే. దీన్ని పాటించకపోతే మనం, మన పిల్లలు, మన మిత్రులు… ఇలా యావద్భారతం ఇబ్బందులు పడుతుంది’అని ప్రధాని స్పష్టం చేశారు. (మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *