కంటి ఇన్ఫెక్షన్‌తోనూ ట్రైలర్ లాంచ్‌కు రణ్‌బీర్.. అభిమానులను ఆకట్టుకున్న అంకితభావం

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కంటి సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పటికీ, తాను నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఢిల్లీలో విడుదల చేయనున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నిర్మాణ దశ నుంచే భారీ అంచనాలు సొంతం చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలకు చిత్రబృందం సన్నాహాలు పూర్తి చేసింది. ఇదే సమయంలో రణ్‌బీర్‌కు కంటి ఇన్ఫెక్షన్ రావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఇన్ఫెక్షన్ ఆయన కుమార్తె రాహా కపూర్ నుంచి సోకినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ సినిమా పట్ల తన నిబద్ధతను చాటుతూ రణ్‌బీర్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జాగ్రత్త చర్యగా ఈ వేడుకలో ఆయన నల్ల కళ్లద్దాలు ధరించే అవకాశం ఉందని సమాచారం. అభిమానులు మాత్రం ట్రైలర్ లాంచ్‌లో రణ్‌బీర్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.