ప్రతి ఇంటా సమగ్ర సర్వే

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటా సమగ్ర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారంలోగా ఈ సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్‌ నియంత్రణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నంత వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. సర్వే పూర్తి కాగానే మరికొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. (వైద్యుల సూచన మేరకే మందులు వాడాలి)

సీఎం ఆదేశాలు, సూచనలు
– ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్‌ అయినవారిపైనే కాకుండా ప్రజలందరిమీద కూడా దృష్టి పెట్టాలి.
– ఇందు కోసం మరో దఫా వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సర్వే చేయాలి. ఇందుకు అందరూ సహకరించాలి. కరోనా లక్షణాలు ఉన్న వారికి సత్వరమే వైద్య సహాయం అందించాలి. ఇలా చేస్తే కోవిడ్‌–19 వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతాం.
– ప్రజలు బయట తిరిగితే.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. అందువల్ల ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించాలి. ప్రజలంతా ఇంట్లో ఉండడం వల్ల వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు చేసే సర్వేకు సహకరించిన వారవుతారు.
– రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణకు ప్రజల నుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారివే. సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య, ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
– రెండోసారి సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది. లక్షణాలు ఉన్న వారు విధిగా హోం ఐసోలేషన్‌ పాటించాలి.
– సమీక్షా సమావేశంలో ఏపీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ చైర్మన్‌ సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *