జగన్ వర్సెస్ షర్మిల పోరు ఖాయం? విజయమ్మ మొగ్గు ఎటో..?

ఏపీలో పదేళ్ల క్రితం రాష్ట్ర విభజనతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ.. తిరిగి తమ పార్టీకి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా పునర్వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం ఖాయమైపోయింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలింది. ఇది కాస్తా వచ్చేస్తే ఇక ఏపీలో వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరు ఖరారవుతుంది.

 

ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇప్పటివరకూ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనను లైట్ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా తమకు ఎదురులేదని భావిస్తున్నారు. కానీ చెల్లెలు వైఎస్ షర్మిల రేపు ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే మాత్రం లైట్ తీసుకునే పరిస్ధితి కచ్చితంగా ఉండకపోవచ్చు.

 

గతంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తల్లి విజయమ్మ తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న చెల్లెలు షర్మిల వద్దకు వెళ్లేందుకు నిర్ణయించుకోగానే ఆ పదవి నుంచి రాజీనామా చేయించేసిన వైఎస్ జగన్.. ఇప్పుడు స్వరాష్ట్రంలో తిరిగి అదే చెల్లెలు తనకు పోటీగా వస్తే ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. అలాగే ఒకప్పుడు తన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయంగా కుదురుకునే వరకూ ఏపీలో వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్న విజయమ్మ.. కుమార్తె షర్మిల వైఎస్సార్టీపీ పెట్టగానే తన అవసరం ఉందంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి షర్మిల ఏపీకి వస్తే ఆమె ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది.

 

వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరు మొదలైతే పిల్లలిద్దరిలో ఎవరిని సమర్ధించినా మరొకరికి ఇబ్బందికర పరిస్దితులు తప్పవు కాబట్టి ఇద్దరికీ దూరంగా హైదరాబాద్ లోనే ఉండిపోవడం వైఎస్ విజయమ్మ ముందున్న తొలి ఆప్షన్. లేదంటే కొడుకు జగన్ ఎలాగో రాజకీయంగా కుదురుకున్నాడు కాబట్టి రాజకీయాల్లో ఓనమాల దశలోనే ఉన్న కుమార్తెకు ప్రస్తుతానికి అండగా ఉండాలని భావిస్తే మరో సమీకరణం తెరపైకి వచ్చినట్లే. ఈ రెండు ఆప్షన్లలో విజయమ్మ ఒకటి ఎంచుకునే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *