తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మొదటి నుంచి ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ కార్యాలయాలకు భారీగా ప్రజలు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. ఇటు హైదరాబాద్ లో ఉన్న వారు దరఖాస్తులు చేయడానికి సొంతూరు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి జనాలు భారీగా గ్రామాలకు తరలివెళ్తున్నారు.
ప్రజలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచే పంచాయతీ కార్యాలయాల వద్ద బారులు తీరారు. మున్సిపాలిటీల్లోని వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలకు జనం జాతరలా వచ్చారు. దరఖాస్తులు సమర్పించడానికి సమయం ఉన్నప్పటికీ భారీగా ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. అధికారులు వంద దరఖాస్తులకు ఒక కౌంటర్ ను ఏర్పాటు చేశారు.
ఇటు మీ సేవ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, ఆధార్ సెంటర్ల కూడా రద్దీగా మారాయి. దరఖాస్తు ఫారాలను జిరాక్స్ సెంటర్ల యజమానులు రూ.20 నుంచి రూ.30 విక్రయించారు. అయితే ఫారలను తము ఉచితంగా అందిస్తామని.. బయట కొనుగోలు చెయ్యొద్దని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు బయట కొనుగోలు చేసి దరఖాస్తు చేస్తున్నారు. దీంతో జిరాక్స్ కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది.
ఇప్పికే ఆసరా పింఛన్ పొందుతున్నవారెవరూ మళ్లీ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. కొత్తగా చేయూత పింఛన్ కోసం మాత్రం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గ్రామసభ జరిగిన రోజు దరఖాస్తు చేయలేని తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. చాలా మంది ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్లకు తరలొచ్చారు.