పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ గ్వాదర్ జిల్లా జివానీ ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ శిబిరంపై దాడి చేసినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. ఈ దాడిలో భారీ ప్రాణనష్టం జరిగిందని బీఎల్ఏ తన ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ వివరాలను పాకిస్థాన్ ప్రభుత్వం లేదా సైన్యం అధికారికంగా ధృవీకరించలేదు.
బీఎల్ఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని కోస్ట్ గార్డ్స్ శిబిరంలోకి దూసుకెళ్లించి పేల్చిన అనంతరం తమ సాయుధ సభ్యులు కాల్పులు జరిపినట్లు పేర్కొంది. దాడిలో పలువురు భద్రతా సిబ్బంది మృతిచెందారని, మరికొందరు గాయపడ్డారని సంస్థ ప్రకటించింది. అయితే ఈ సంఖ్యలపై స్వతంత్ర ధృవీకరణ అందుబాటులో లేదు.
ఈ ఘటనపై ఇప్పటివరకు పాకిస్థాన్ సైన్యం లేదా ఐఎస్పీఆర్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. బలూచిస్థాన్‌లో స్వయంప్రతిపత్తి కోసం బీఎల్ఏ చాలా కాలంగా సాయుధ పోరాటం కొనసాగిస్తుండగా, చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC)కు సంబంధించిన ప్రాజెక్టులు, భద్రతా బలగాలపై గతంలో కూడా దాడులకు పాల్పడినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.