బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న వార్ డ్రామా ‘మాతృభూమి’ సెన్సార్ సమస్యలతో వార్తల్లో నిలిచింది. భారత్-చైనా సరిహద్దులోని గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మొదట వేరే పేరుతో తెరకెక్కినప్పటికీ, మారిన అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా కథలో మార్పులు చేసి, టైటిల్‌ను ‘మాతృభూమి’గా మార్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొన్ని సన్నివేశాలను తిరిగి చిత్రీకరించినట్లు సమాచారం.
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటించగా, అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటించగా, హిమేష్ రేష్మియా సంగీతం అందించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. తొలుత ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించిన చిత్రాన్ని తర్వాత ఆగస్టు విడుదలకు వాయిదా వేశారు.
అయితే, ప్రస్తుతం సెన్సార్ క్లియరెన్స్‌కు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఆగస్టు విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.