గత ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ విషయంలో 2019, 2023లో రెండుసార్లు మోసపూరిత శంకుస్థాపనలు చేసి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా రాయలసీమ ప్రజలు ఎదురుచూస్తున్న ఉక్కు కర్మాగారం కలను తమ ప్రభుత్వం నిజం చేసిందని ఆయన తెలిపారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ) రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “విభజన తర్వాత ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, అనుమానాలను దాటుకుని రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించాం. గత పాలకులు 2019, 2023లో రెండుసార్లు ఇక్కడే శంకుస్థాపన, భూమి పూజలు చేశారు. కానీ ఐదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మేం అధికారంలోకి రాగానే పనులు మొదలుపెట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం” అని వ్యాఖ్యానించారు.
రూ.16 వేల కోట్లకు పైగా పెట్టుబడి.. వేల ఉద్యోగాలు
రెండు దశల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో, ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. దీనికి అనుబంధంగా రూ.20,350 కోట్ల వ్యయంతో 3,850 మెగావాట్ల సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం వివరించారు. ఈ ప్లాంట్‌ను పూర్తిగా గ్రీన్ ఎనర్జీతోనే నడుపుతారని తెలిపారు. ఇదే వేదిక నుంచి విజయనగరం జిల్లాలో రూ.531 కోట్లతో 1,166 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కును కూడా సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు.
కియా అభివృద్ధికి, బ్రాహ్మణి స్టీల్స్ అవినీతికి నిదర్శనం
గత ప్రభుత్వాల పనితీరును, తమ పాలనను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పోల్చి చూపారు. మేం రాష్ట్రాభివృద్ధికి కియా మోటార్స్ వంటి పరిశ్రమను తీసుకొస్తే, మరొకరు బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో సహజ వనరులను దోచుకున్నారని, ఈ రెండే అభివృద్ధికి, అవినీతికి నిదర్శనాలని అన్నారు.
“దేశవ్యాప్తంగా పోటీ ఉన్నా 2017లో అనంతపురానికి కియా పరిశ్రమను తెచ్చాం. నేడు ఆ పరిశ్రమ 19 లక్షల కార్లను ఉత్పత్తి చేసి, 90 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. కానీ, 2007లో బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో 14 వేల ఎకరాలు తీసుకుని, ఓబుళాపురం గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేశారు. ప్లాంట్ పెట్టలేదు, ప్రజలను మోసం చేశారు. తప్పు చేసిన వాళ్లు జైలుకు వెళ్లారు. ఎవరిది విశ్వసనీయతో, ఎవరు మోసగాళ్లో ఈ ఒక్క ఉదాహరణతోనే ప్రజలకు అర్థమవుతుంది” అని చంద్రబాబు అన్నారు.
రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
జేఎస్‌డబ్ల్యూ బళ్లారి ప్లాంట్ కంటే అధిక సామర్థ్యంతో రాయలసీమ ప్లాంట్‌ను తీర్చిదిద్దాలని సజ్జన్ జిందాల్‌ను కోరినట్లు సీఎం తెలిపారు. ప్లాంట్ అవసరాల కోసం గండికోట నుంచి 2 టీఎంసీల నీటిని పైప్‌లైన్ ద్వారా అందిస్తామని, అత్యంత నాణ్యమైన స్థానిక ఇనుప ఖనిజాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని, జేఎస్‌డబ్ల్యూ, విశాఖ స్టీల్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఉక్కు రాష్ట్రంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ ఇక కరవు నేల కాదని, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీతో అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు.
ఆగస్టు 15న మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామని, అమెరికాలోని గ్రాండ్ కాన్యన్‌కు ధీటుగా గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.