ముంబై : ఇండియా ధనిక దిగ్గజం ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పుంజుకోవడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 10 శాతం లాభంతో రూ.1,363 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 743 పాయింట్ల లాభంలో దాదాపు సగం వాటా(383 పాయింట్లు) ఈ షేర్‌దే ఉండటం విశేషం. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.80,711 కోట్లు ఎగసి రూ.8,64,268 కోట్లకు ఎగబాకింది. రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను ఫేస్‌బుక్ రూ.43,574 కోట్లు(570 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా ఈ షేరు జోరుగా పెరిగింది. టెక్నాలజీ రంగంలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. గత ఏడాది డిసెంబర్ నాటికి రిలయన్స్ రుణ భారం రూ.1.53 లక్షల కోట్లుగా ఉంది. ఈ నిధులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణ భారం భారీగా తగ్గనున్నది. వచ్చే ఏడాది మార్చికల్లా రుణ రహిత కంపెనీగా అవతరించాలన్న రిలయన్స్ కంపెనీ లక్ష్యం సాకారం కావడానికి ఫేస్‌బుక్ డీల్ తోడ్పడనున్నది.