సింగరేణి సమరం..

సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. సాధారణ ఎన్నికలను తలపించేలా ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన నేతల భవితవ్యం తేలేందుకు సమయం ఆసన్నమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రచార సమయం ముగిసే ఆఖరి నిమిషం వరకు కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు నేతలు. అయితే వారిని మెప్పించిందేవరు? అన్నది తమ బొగ్గు గని కార్మికులు ఓటుతో సమాధానం చెప్పనున్నారు. ఏడో సారి జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికలలో మొత్తం 13 యూనియ‌న్లు పోటీ ప‌డుతున్నాయి.

 

రాష్ట్రంలోని కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 39 వేల 748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 11 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. రాత్రి ఏడు గంటల తరువాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

 

కోల్ బెల్ట్ ఏరియాలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అనుబంధ విభాగం సత్తా చాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది TBGKS. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. సింగరేణి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలు కలిసి పోటీ చేయాలనుకున్నా.. పొత్తుల చర్చలు విఫలం కావడంతో వేర్వేరుగా బరిలో దిగుతున్నాయి. దీంతో అతి పెద్ద యూనియన్‌గా ఉన్న AITUC, INTUC మధ్యే ప్రధాన పోటీ నెలకొననుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *