తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సేవలు జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ప్రధాన వెబ్‌సైట్‌తో పాటు అన్ని ఆన్‌లైన్, ఆఫ్-లైన్ అనుబంధ సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల విరామం అనంతరం జూన్ 29వ తేదీ నుంచి యథావిధిగా అన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు పునఃప్రారంభం అవుతాయి.
దాదాపు ఐదేళ్ల తర్వాత సర్వర్లను పూర్తిస్థాయిలో అప్‌గ్రేడ్ చేయడం, సాంకేతిక నిర్వహణ పనుల (సర్వర్ మెయింటెనెన్స్) కోసమే ఈ విరామం తీసుకున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ కీలకమైన అప్‌గ్రేడేషన్ ద్వారా భవిష్యత్తులో సర్వర్ల పనితీరు, వేగం మెరుగుపడటంతో పాటు డాటా భద్రత కూడా మరింత పటిష్టం అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ అప్‌డేట్ పూర్తయ్యాక ప్రజలకు ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా మరింత వేగవంతమైన సేవలు అందుతాయి.
ప్రజలకు వీలైనంత వరకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ షట్‌డౌన్‌ను సెలవు దినాల్లో ప్లాన్ చేశారు. జూన్ 26న మొహర్రం పబ్లిక్ హాలిడే, జూన్ 28న ఆదివారం కావడంతో.. కేవలం జూన్ 27వ తేదీ (శనివారం) ఒక్క పనిదినం మాత్రమే సేవలపై ప్రభావం పడనుంది. కాబట్టి అత్యవసరంగా భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన వారు జూన్ 26కు ముందే తమ పనులను పూర్తి చేసుకోవాలని, అధికారులు సూచించారు.