ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయ విమర్శల దాడిలో భాగంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు హద్దులు దాటడం, వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లడంతో ఈ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి అనుచిత, కించపరిచే పదజాలం వాడటంపై రాజకీయ వర్గాలతో పాటు వివిధ ప్రజా సంఘాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. గతంలో బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో పనిచేసిన వ్యక్తి, మహిళల పట్ల ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన గుడివాడ అమర్నాథ్పై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా మహిళా కమిషన్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు జారీ చేసి, తక్షణమే వివరణ కోరే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ.. వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ విలువలను దిగజార్చడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఇష్యూపై అధికార కూటమి నేతలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతూ, అమర్నాథ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టపరంగానే కాకుండా రాజకీయంగానూ ఆయనను ఇరుకున పెట్టేందుకు ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా కమిషన్ తదుపరి తీసుకునే కఠిన చర్యలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.