ఒలింపిక్స్ క్రీడలు 2036 సంవత్సరంలో ఇండియాలో జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్‌లో ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలు జరిగితే వాటి నిర్వహణ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉంటుందని అమిత్ షా తెలిపారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వద్ద సర్దార్ పటేల్ కాంప్లెక్స్ ఒలంపిక్స్ క్రీడలకు వేదిక కావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత ప్రభుత్వం బిడ్ సమర్పిస్తుందని ఇంతకుముందు ప్రధాన మంత్రి మోదీ చెప్పిన విషయం అమిత్ షా గుర్తు చేశారు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం ప్రధాన మంత్రి రూ.4600 కోట్లు కేటాయించినట్లు కూడా తెలిపారు.
షా సొంత నియోజకవర్గమైన గాంధీనగర్‌లో ఓ క్రీడా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా వెళ్లారు. అక్కడ చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల్లో క్రీడలను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారని ఆయన తెలిపారు.