పర్చూరు నుంచి ఓడిపోవడమే మంచిదైంది.. మాజీమంత్రి దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు..

పర్చూరు నుంచి వైసీపీ తరఫున గెలవకపోవడమే మంచిదైందని మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు చేతిలో పరాజయం పాలయ్యారు. బాపట్ల జిల్లా.. కారంచేడులో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

బీజేపీ అధికారంలో లేనప్పుడే పురందేశ్వరి.. ఆ పార్టీలో చేరారన్న ఆయన… కారంచేడులో రోడ్లు వేయలేదని గ్రామస్థులే తనతో చెబుతున్నారని అన్నారు.. 2019 ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో తాను రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదమో అన్నారు. భగవంతుడి దయవల్ల పర్చూరు నియోజకవర్గంలో నేను ఓడిపోవడం మంచిదైందన్నారు వెంకటేశ్వరావు.

 

తాను ఓడిపోయిన రెండు నెలలకి సీఎం జగన్ పిలిచి.. తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారని.. కానీ.. జగన్ పెట్టిన నిబంధనలకు వైసీపీలో ఇమడలేమని నిర్ణయించుకున్నామని ఆయన గుర్తు చేశారు. నేడు రాజకీయాలంటే బూతులు తిట్టుకోవటం.. దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు దగ్గుబాటి. సీనియర్‌ నేతగా ఉండటం సహా గత ఎన్నికల్లో జగన్‌కు పూర్తి మద్దతు ఇచ్చిన వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *