ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాల అమలు ప్రారంభించాయి. సీఎం జగన్ ఇంఛార్జ్ ల మార్పుతో పాటుగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అభ్యర్దులు, మేనిఫెస్టో పైన ఫోకస్ చేసాయి. ఈ సమయంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. వైసీపీ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
జగన్ పాదయాత్రలో సినీ నటుడు పృథ్వీరాజ్ మద్దతుగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఆయనకు ఎస్వీబీసీ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో వచ్చిన ఆరోపణలతో ఆయన్ను తప్పించారు. తరువాతి కాలంలో పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమని..తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం పైన పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. కూటమి 135 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లతో విజయకేతనం ఎగుర వేస్తుందన్నారు.
రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. బలిజ, కాపులు ఐకమత్యంలో జగన్ పాలనకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. జనసేన అధిష్ఠానం ఆదేశిస్తే సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుపై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. మరో మంత్రి రోజాపై పృథ్వీరాజ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రోజా అసంబద్ధ వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు, మహిళా ఎమ్మెల్యేలే పట్టించుకోవడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలోనే ఆమెకు మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేల మద్దతు కరువైందన్నారు.
వైనాట్ 175 అంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారనీ, అంత ఆత్మవిశ్వాసముంటే 92 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నట్లు అని ప్రశ్నించారు. రానున్న వందరోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని పృథ్వీరాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. మంత్రి అంబటి రాంబాబు తన కంటే బాగా డాన్స్ చేస్తారని ఎద్దేవా చేసారు. ఏపీ భవిష్యత్ కు టీడీపీ – జనసేన కూటమితో ఏర్పడే ప్రభుత్వం కీలకంగా మారబోతోందని వ్యాఖ్యానించారు.