రాష్ట్రంలో ఇద్దరు ప్రైవేటు డాక్టర్లకు కరోనా సోకింది. వీరిద్దరూ భార్యా భర్తలు. వీరికి విదేశాల నుంచి వచ్చిన చరిత్ర లేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. భర్త వయసు 41 ఏళ్లు కాగా, భార్య వయసు 36 ఏళ్లు అని తెలిపింది. అలాగే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా గురువారం పాజిటివ్ వచ్చింది. సికింద్రాబాద్‌లోని బుద్దానగర్‌కు చెందిన మరో వ్యక్తి (45)కి కూడా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ ఢిల్లీ వెళ్లి వచ్చారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 45కు చేరింది. అయితే వీరిలో ముగ్గురికి ఎవరి నుంచి కరోనా వైరస్ సోకిందన్న దానిపై ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేకపోతోంది. కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి ఈ నెల 14న సంపర్క్‌క్రాంతి రైలులో ఢిల్లీ వెళ్లాడు. 17న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి బయల్దేరి 18న హైదరాబాద్ వచ్చాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగాడు. అప్పటికే అతడికి జ్వరం, జలుబు ఉన్నాయి. తన కొడుకుతో కలసి ఆటోలో ఇంటికి వెళ్లాడు. కుత్బుల్లాపూర్‌లో ఒక డాక్టర్‌ను కలిశాడు. అజిత్రోమైసిన్, డోలో 650 మాత్రలను వాడాలని డాక్టర్ చెప్పాడు. 18 నుంచి ఈ మందులనే వాడిన ఆయన.. అత్యంత ఆలస్యంగా 25న గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. అతడి నమూనాలు తీసుకున్న వైద్యులు, కరోనా పాజిటివ్‌గా ప్రకటించారు.