జాతీయం : రోనా వైరస్ కట్టడికి పోరాడుతున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే లక్షలలో జరిమానా , 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. కోవిడ్‌పై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, ఇతర పారామెడికల్ సిబ్బందిపై దాడులు చేస్తే తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని జవదేకర్ వివరించారు.
కరోనా విపత్తు ముగిసిన అనంతరం కూడా ఈ చట్టంలోని నిబంధనలను కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు పూర్తి వివరణ ఇవ్వకుండా.. ‘ఎపిడమిక్ చట్టానికి సవరణ చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ ఇది, అయితే, ఇది మంచి ప్రారంభం’అని మాత్రం వ్యాఖ్యానించారు. కోవిడ్–19పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ. 50 లక్షల బీమా కల్పిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని జవదేకర్ గుర్తు చేశారు. కరోనా పేషెంట్ల కోసం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.86 లక్షల బెడ్స్, 24 వేల ఐసీయూ బెడ్స్‌తో 723 కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామన్నారు.