పీవీకి నివాళి.. ఆర్థిక వ్యవస్థను మార్చిన మేధావిగా వర్ణించిన సీఎం రేవంత్…

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నర్సింహ్మరావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పీవి నరసింహారావు వర్థంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద ఆయనకు ఘనంగా నివాళ్లు అర్పించారు. పీవీ నరసింహారావు పరిపాలనలో అనేక మార్పులు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన గొప్ప మహనీయుడు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

 

పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారన్నారు . దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని సీఎం అన్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై పీపీ ఒక మాట చెప్పారన్నారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటాడు అని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పీవీ సంస్కరణలు సదా ఆచరణీయమని.. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చాడన్నారు.

 

పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని.. పీవీ నరసింహారావు కీర్తిని పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. అనంతరం పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. నివాళ్లు అర్పించిన వారిలో మంత్రులు కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీవీ నరసింహారావు వర్థంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఘనంగా నివాళ్లు అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత పీవీ నరసింహారావుకే సొంతమని అన్నారు. విద్యా వ్యవస్థతో సహా సామాజిక మార్పులకు కృషి చేశారన్నారు. భూ సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి పీవీ అని భట్టి కొనియాడారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *