లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీలో ఇబ్బందు లు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎవరూ ఆందోళనకు గురికావద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ కలెక్టరేట్‌లో గురువారం కరోనా నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండి లాక్‌డౌన్‌ను పాటించి, కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలన్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయించ డం, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా కఠిన చర్యలతో పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించించారు. కరోనాపై సహాయక చర్యలు అందించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు విదేశాల నుంచి 53 మంది రాగా, అందరికి కరోనా నెగెటీవ్ రిపోర్టు వచ్చిందన్నారు. కరోనా వైర్‌సకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, స్వీయరక్షణ పాటిస్తూ ఇళ్ల వద్దనే ఉంటే వైరస్ మన వద్దకు రాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్, తదితర శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించామని, వారి కదలికలపై ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తున్నదని అన్నారు.