తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేసారు. అర్హుల ఎంపిక క్షేత్ర స్థాయిలోనే జరిగేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అర్హులైన వారికి కార్డులు అందించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నారు.
కొత్త కార్డుల జారీ: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు నిరీక్షిస్తున్నాయి. దీంతో, ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ -సేవ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హుల ఎంపిక క్షేత్ర స్థాయిలోనే జరగనుంది.
అవసరమైన పత్రాలను ఆన్ లైన్ లో దరఖాస్తు సమయంలోనే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను గ్రామ..బస్తీ సభల ద్వారా అధికారులు ఎంపిక చేయనున్నారు. పూర్తి పారదర్శకంగా ప్రక్రియ అమలు చేసేందుకు విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. రేషన్ కార్డు ఆధారంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. దీంతో, అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు.
మార్పులు – చేర్పుల కోసం: ప్రభుత్వం తాజాగా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ 10 లక్షలకు పెంచింది. రేషన్ కార్డు ఉన్నవారికే ఆరోగ్య శ్రీ అమలు కానుంది. దీంతో రేషన్ కార్డు కోసం మరింత అవసరం ఏర్పడింది. రేషన్ కార్డులో పేరున్న ప్రతీ ఒక్కరికీ ఆరు కేజీల బియ్యం అందుతాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో గోధుమలు కూడా ఇస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో 11.02 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. ఇక, మార్పులు, చేర్పుల కోసం లక్షలాది మంది వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలను చేర్చాలనే వినతులు వచ్చాయి. అయితే, ఎడిట్ ఆప్షన్ లేకపోవటంతో ఇప్పటి వరకు ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కరించాలని నిర్ణయించింది.
మార్గదర్శకాలు సిద్దం: రాష్ట్రంలో ఇప్పటి వరకు 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్ట కింద 54.39 లక్షలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులు 35.59 లక్షలుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక..ముఖ్యమంత్రి రేవంత్ కలెక్టర్లతో సదస్సు ఏర్పాటు చేసారు.
ఈ సమయంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటుగా మార్పులు, చేర్పులకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల గురించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీని పైన ప్రభుత్వం అధికారికంగా విది విధానాలను కలెక్టర్ల కాన్ఫిరెన్స్ లో వెల్లడిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.