విశ్వంలో క్రిస్మస్ ట్రీ..

గగనాంతర రోదసిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మిరుమెట్లు గొలిపే కాంతులతో క్రిస్మస్ ట్రీ ఒకటి శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. వాస్తవానికి అది క్రిస్మస్ ట్రీ. ఆ ఆకారంలో ఏర్పడిన నక్షత్రాల సమూహం. దానిని NGC 2264గా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ ట్రీ క్లస్టర్‌గానూ పిలుస్తున్నారు. అందమైన ఆ కాస్మిక్ ట్రీని నాసా తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.

 

భూమి నుంచి 2500 కాంతి సంవత్సరాల దూరంలో మన పాలపుంత గెలాక్సీలోనే ఉందా కాస్మిక్ ట్రీ. విశ్వం విస్తరణలో భాగంలో కొత్తగా ఏర్పడిన నక్షత్రాలు ఇలా క్రిస్మస్ చెట్టు రూపంలో ఒక క్టస్లర్‌గా ఏర్పడ్డాయి. ఆ నక్షత్రాల వయసు 1-5 మిలియన్ సంవత్సరాల లోపు ఉంటుంది. సూర్యుడి పరిమాణంతో పోలిస్తే.. ఆ యువ నక్షత్రాల్లో కొన్ని చిన్నవి కాగా.. మరికొన్ని చాలా పెద్దవి.

 

కాస్మిక్ ట్రీలోని తారలు అత్యంత క్రియాశీలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎక్స్-రేల రూపంలో అవి శక్తిని వెలువరిస్తున్నాయి. ఆ నక్షత్రాల చుట్టూ ఏర్పడిన వాయువులు మారుతున్నట్టు కూడా శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. చుట్టుపక్కల గ్యాస్ డిస్క్‌లు వెదజల్లుతున్న పదార్థాలు వాటిపై పడటం వల్ల ఈ మార్పులు సంభవిస్తుండొచ్చని భావిస్తున్నారు.

 

యువ నక్షత్రాలు నీలం, తెలుపు కాంతుల్లో ఎక్స్-కిరణాలను వెలువరుస్తున్నట్టు నాసా చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ చిత్రాల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆకుపచ్చ కాంతి.. నెబ్యులాలోని వాయువులను ప్రతిబింబిస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు. చిత్రంలో అక్కడక్కడా ధవళ కాంతిలో కనిపిస్తున్న చుక్కలు.. కాస్మిక్ ట్రీకి ముందు, వెనుక వైపు ప్రకాశిస్తున్న నక్షత్రాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *