కరోనా కొత్త సబ్ వేరియంట్ కలవరం.. దేశవ్యాప్తంగా 21 కేసులు నమోదు..

దేశంలో మళ్ళీ కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కొవిడ్ ఉపరకానికి చెందిన జేఎన్.1 వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 21 కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గోవాలో అత్యధికంగా 19, కేరళ, మహారాష్ట్ర లో ఒక్కొక్కటి చొప్పున కొవిడ్-19 ఉపరకం కేసులు నమోదు అయినట్లు తెలిపింది.

 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నట్లు వెల్లడించింది. కేవలం ఒక్కరోజులోనే 614 కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. మూడు మరణాలు సంభవించినట్టు తెలిపింది. పెరుగుతున్న కేసులు పరిశీలిస్తే మే 21 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది . ప్రస్తుతం కోవిడ్ కేసులు సంఖ్య దేశవ్యాప్తంగా 2,311కు చేరింది.

 

కోవిడ్ వ్యాప్తిని అన్ని విధాల ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధికారులకు ఉన్నత స్థాయి సమావేశంలో స్పష్టంచేశారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేసులు వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో ఉన్న ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

 

కోవిడ్ సబ్ వేరియంట్ జేన్.1 కేసులు పలు దేశాల్లో వెలుగుచూస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్ మొదలైన దేశాలలో కూడా ఈ కేసులు నమోదైనట్లు తెలిపంది. ఈ కొత్తరకం వేరియంట్ ని “వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ “గా డబ్ల్వూహెచ్ వో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1తోపాటు ఇతర వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపింది. ప్రస్తుతం నమోదు అవుతున్న వెరియంట్ కేసులు వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కానీ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరోవైపు సింగపూర్ లో గత వారం రోజుల్లోనే 56 వేల కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *