స్టాక్‌ మార్కెట్లకు నష్టాలు

వరుసగా మూడు రోజుల పాటు లాభాలను నమోదుచేసిన దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు వారాంతాన నీరసించిపోయాయి. శుక్రవారం ఉదయం ఏకంగా 4 శాతం వరకు ర్యాలీ చేసిన సెన్సెక్స్‌ చివరకు 131 పాయింట్లు (0.44 శాతం) నష్టంతో 29,815 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 31,126 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన సెన్సెక్స్‌.. ఈ స్థాయి నుంచి చూస్తే 1,310 పాయింట్లను కోల్పోయింది. భారత జీడీపీ 2020లో కేవలం 2.5 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ తన అంచనాను సవరించడం, అంతర్జాతీయంగా కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ మరణాలు పెరగడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో ఒక దశలో 29,347 పాయింట్లకు పడిపోయింది. ఇంట్రాడేలో 8,522 పాయింట్లకు పడిపోయిన నిఫ్టీ ముగింపు సమయానికి కోలుకుని 19 పాయింట్ల లాభంతో 8,660 వద్ద క్లోజయింది. ఉదయం సెషన్లో ఈ సూచీ 8,949 గరిష్ట స్థాయికి చేరింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా కుంగిపోయిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పలు కీలక నిర్ణయాలను ప్రకటించినప్పటికీ.. ఇవేవీ మార్కెట్‌ను నిలబెట్టలేకపోయాయి. రెపో రేటు 4.4 శాతానికి దిగిరావడం బుల్స్‌కు శక్తిని ఇవ్వకపోగా, బేర్స్‌కు పట్టు పెంచింది. దీంతో వరుసగా 6వ వారంలోనూ సూచీలు నష్టాలనే నమోదు చేశాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *