ఆస్తి కోసం చిన్నపిల్లలతో సహా ఆరుగురి హత్య.. స్నేహితుడే హంతకుడు!

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్(25) అనే యువకుడు ఆస్తి కోసం తన స్నేహితుడు ప్రసాద్, అతని కుటుంబాన్ని కిరాతకంగా హత్య చేశాడు. ప్రసాద్ స్వగ్రామం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి. అతనికి భార్య, ఇద్దరు పిల్లలతోపాటు, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తల్లితో మాక్లూర్‌లో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో మాక్లూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో అతను స్నేహం చేశాడు.

 

పోలీసుల కథనం ప్రకారం.. వ్యాపార లావాదేవీల కోసం బ్యాంకు లోన్ కావాలని ప్రసాద్ ప్రయత్నిస్తుండగా.. అతని స్నేహితుడు ప్రశాంత్ తాను సహాయం చేస్తానని ముందుకొచ్చాడు. బ్యాంకు నుంచి తన పేరు మీద లోన్ వస్తుందని.. అయితే ముందుగా ప్రసాద్ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయాలని నమ్మబలికాడు. లోన్ తీర్చేయగానే మళ్లీ ఇంటిని తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ప్రసాద్ స్నేహితుడి మాటలు నమ్మి.. తన ఇంటిని.. ప్రశాంత్ పేరు మీద రిజిస్టర్ చేయించాడు. కానీ లోన్ రాలేదు. కొన్ని రోజుల తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ప్రశాంత్ ఒక పథకం వేశాడు. లోన్ డబ్బులు కావాలంటే తన వెంట రావాలని చెప్పి.. ప్రసాద్‌ను నవంబర్ 28న అడవిలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. తరువాత శవాన్ని అక్కడే పాతిపెట్టాడు. ఆ తరువాత ప్రసాద్ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేశాడు.

 

రెండు రోజుల నుంచి ప్రసాద్ ఇంటికి రాకపోవడంతో ఇంట్లో అందరూ కంగారు పడుతుండగా.. ప్రశాంత్ వారందరికీ ధైర్యం చెప్పి.. తాను ప్రసాద్ కోసం వెతుకుతున్నానని చెప్పి నమ్మించాడు. అనంతరం డిసెంబర్ 1న, ప్రసాద్ ఇంటికి వెళ్లి.. అతని భార్య శాన్వికను కలిశాడు. ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని.. వెంటనే తనతో బయలుదేరాలని చెప్పి ఆమెను తన వెంట నిజామాబాద్ తీసుకెళ్లి చంపేశాడు. బాసర వంతెన వద్ద ఆమెను గోదావరిలో పడేశాడు. అదే రోజు ప్రసాద్ చెల్లి శ్రావణిని మెదక్ జిల్లా వడియారం సమీపంలో హత్య చేసి మృతదేహాన్ని ప్రశాంత్ తగలుబెట్టాడు.

 

ఆ తరువాత డిసెంబర్ 4న, ప్రసాద్ తల్లి, మరో చెల్లి స్వప్న(దివ్యాంగురాలు), ప్రసాద్ ఇద్దరు పిల్లలను నిజామాబాద్‌కి తీసుకెళ్లాడు. ప్రసాద్‌తో వారిని కలిపిస్తానని చెప్పి.. నిజామాబాద్‌లోని ఓ లాడ్జిలో వారందరినీ ఉంచాడు. ఆ తరువాత ముందుగా ప్రసాద్ ఇద్దరు పిల్లలను చంపేసి మెండోర వద్ద సోన్ బ్రిడ్జి సమీపంలో శవాలను నీళ్లలో పడేశాడు. తరువాత డిసెంబర్ 13న ప్రసాద్ చెల్లి స్వప్నను బయటకు తీసుకెళ్లి సదాశివనగర్ మండలం భూంపల్లి సమీపంలో ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టాడు. లాడ్జి నుంచి వెళ్లిన వారు తిరిగిరావడం లేదు. ఇంటి నుంచి వెళ్లిన కోడలు, మరో కూతురు తిరిగి రాలేదు. ఇది గమనించిన ప్రసాద్ తల్లి సుశీలకు అనుమానం కలిగింది. దీంతో ఆమె లాడ్డి నుంచి పారిపోయింది.

 

 

పోలీసులకు సదాశివనగర్ మండలంలో ఓ దివ్యాంగురాలి మృతదేహం లభించడంతో విచారణ మొదలుపెట్టారు. కూపి లాగడంతో డొంక కదిలినట్టు మొత్తం వ్యవహారం బయటపడింది. ప్రసాద్ కుటుంబంలోని ఆరుగురు హత్యకు గురయ్యారని పోలీసుల విచారణలో తేలింది. గ్రామంలో విచారణ చేయగా.. ప్రశాంత్, అతని తమ్ముడు వంశీ, మరో స్నేహితుడు విష్ణుపై అనుమానం కలిగింది.

 

ముఖ్యంగా ప్రశాంత్ ఒక పేద కుటుంబంలో పుట్టి.. ఒక్కసారిగా కారు, బైక్, ఖరీదైన సెల్ ఫోన్లు కొన్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. మండలంలోని పలువురిని బ్యాంకు లోన్ పేరుతో మోసం చేశాడు. వారి వద్ద డబ్బులు, ఆస్తులు కాజేశాడని.. ఎవరైనా గొడవపడితే.. తనకు రాజకీయ నాయకులతో సంబంధముందని చెప్పి బెదిరించేవాడు. ఈ క్రమంలో ప్రసాద్ ఇంటిని మోసపూరితంగా కాజేసి.. అతడిని, అతడి కుటుంబంలోని ఆరుగురిని కుట్ర చేసి హత్య చేశాడని పోలీసులు వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ సహా అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఖరీదైన మొబైల్స్, ఆస్తి పత్రాలు, కారు, బైక్, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *