లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ప్రజలకు పిలుపునిచ్చాడు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని, కాబట్టి అందరూ ఇంటిపట్టునే ఉండాలని సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఇదొక్కటేనని పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ను సానుకూల దృక్పథంతో చూడాలని కపిల్ కోరాడు. ఈ ప్రాణాంతక వైరస్‌ను అడ్డుకునేందుకు అధికారులు చేస్తున్న పోరాటానికి మీరు చేయవలసింది ఇంట్లో ఉండడమేనని అన్నాడు. ప్రపంచం మొత్తం ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందని, అది మీ కుటుంబమేనని పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులతో గడపడం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం, సంగీతం వినడం వంటివి చేస్తూ ఆనందించాలని సూచించాడు.
దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచిన కపిల్ ఇప్పుడు ఇంట్లో ఉంటూ వివిధ పనులు చేస్తున్నాడు. ‘‘నేను నా ఇంటిని ఊడుస్తున్నాను. తోటను శుభ్రం చేసుకుంటున్నాను. ఇప్పుడీ చిన్న తోట నా గోల్ఫ్ కోర్సు కూడా. నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. గత కొన్నేళ్లుగా నేను కోల్పోయినది ఇదే’’ అని కపిల్ పేర్కొన్నాడు.