వైసీపీ ఎమ్మెల్యేల పరేషాన్‌.. సీఎం క్యాంప్‌ కార్యాలయానికి క్యూ..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే పార్టీలో సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టారు. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ఇప్పటికే వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్నారు. దీంతో ఒక్కో నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ కొత్త ఇంచార్జుల ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇంచార్జులను మార్చేసిన వైసీపీ అధిష్టానం కసరత్తు కొనసాగిస్తుండటంతో సీఎం క్యాంపు కార్యాలయంకు ఎమ్మేల్యేలు క్యు కడుతున్నారు.

 

వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదని భావిస్తున్న ఎమ్మేల్యేలు సీఎంను కలిసేందుకు ఒక్కొక్కరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చేస్తున్న నేతలంతా తమకు మరొకసారి అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర బాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, రామచంద్రపురం ఎమ్మేల్యే, ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్‌ ఎలిజా, గుంటూరు వేస్ట్ మద్ధాలి గిరితో పాటు పలువురు ఎమ్మేల్యేలు సీఎంను కలిసేందుకు ఒక్కొక్కరు వచ్చారు.

 

గత ఎన్నికల్లో ఎమ్మేల్యేలుగా అవకాశం ఇచ్చినా ఈ సారి కూడా అవకాశం ఇవ్వాలని సీఎంను కోరుతున్నారు. ఇప్పటికే కొత్త అభ్యర్థుల ఎంపిక కోసం నివేదికల అనంతరం ఎమ్మేల్యేలుగా మంత్రులుగా ఉన్న వారిని సైతం పక్కన పెడుతున్న సీఎం జగన్.. తాజాగా మరికొంత మంది జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎమ్మేల్యేలుగా ఉన్న తమను పక్కన పెట్టడంతో మరొక్కసారి అవకాశం ఇవ్వడం లేదా మరో నియోజకవర్గంలో పోటీ చేసేందుకు తమకు స్థానం ఇవ్వాలని ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం నివేదికల ఆధారంగా తొలిదశలో మార్పులు చేర్పులు చేసిన సీఎం.. ఇకపై మరింత దూకుడుగానే మిగతా జాబితా సిద్ధం చేస్తున్నారు. దీనితో ఎవరికీ టికెట్ ఉంటుందో ఎవరికి ఊడుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

 

వైసీపీ అభ్యర్థుల మార్పు, ఇంచార్జుల నియామకం వెనుక సామాజిక సమీకరణాలు, నియోజకవర్గం పరిధిలో పరిస్థితుల ఆధారంగానే మార్పులు చేర్పులు జరిగాయనీ వైసీపీ పెద్దలు చెప్తున్నా.. తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఎమ్మేల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనితో ఒక్కొక్కరు ఎమ్మల్యేలుగా ఉన్న వారంతా అటు ప్రస్తుతం పార్టీని వీడలేక అలా అని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేక అటు క్యాంపు కార్యాలయం.. ఇటు పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. మొత్తానికి వైసీపీలో ఇంచార్జుల మార్పు అటు సీనియర్లు జూనియర్లు, కొత్త పాత అని తేడా లేకుండా సీఎం జగన్ చేపడుతున్న వేళ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొంత మంది పార్టీ తరపున బరిలో నిలిచేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *