పారిశ్రామికాభివృద్ధిపై సీఎం సమీక్ష.. ఇండస్ట్రియల్ కారిడార్‌ల ఏర్పాటుపై కీలక నిర్ణయం..

నూతన ఇండస్ట్రీయల్ కారిడార్‌లను ఏర్పాటు చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్ కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు లోపల 500 నుంచి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవి కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలన్నారు.

 

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలసి సమీక్ష నిర్వహహించారు రేవంత్ రెడ్డి. పరిశ్రమలకు సేకరించే భూములు, బంజరు భూములై ఉండడంతో పాటు సాగుకు యోగ్యం కానివిగా ఉండాలని క్లియర్‌గా అధికారులకు సూచించారు. దీని వల్ల రైతులకు నష్టం కలుగకుండా ఉండడంతోపాటు కాలుష్యం తక్కువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే విధంగా ఉంటుందన్నారు.

 

అంతేగాకుండా ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు కాకుండా.. ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారు.

 

ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత నివ్వాలని, హైదరాబాద్ లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ ఇతర ఇండస్ట్రియల్ కారిడార్‌ల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు.

 

జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారన్నారు. పరిశ్రమలకు ధర్మల్ విద్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్‌ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. బాలానగర్‌లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *