రేపే శాసన సభ్యుల క్రీడోత్సవాలు.. ఎల్బీ స్టేడియంలో గేమ్స్..

రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు నిర్వహించబోతున్నారు. దాదాపు 12ఏళ్ల తర్వాత నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఎల్బీ స్టేడియంలో క్రీడలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా పోటీల ఏర్పాట్లను శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి పరిశీలించారు. సిబ్బందికి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

 

ఈ నెల 28 నుంచి స్టేడియంలో ఫస్ట్ ఎడిషన్ లెజిస్లేటీవ్ స్పోర్ట్స్ మీట్-2026 నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల్లో క్రీడలపై అవగాహన తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శాసన, మండలి సభ్యుల క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. ఈ పోటీలలో టగ్ ఆఫ్ వార్, ఫుట్ బాల్, క్రికెట్ అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తోపాటు కొన్ని రిక్రియేషనల్ క్రీడా పోటీలు నిర్వహించబోతున్నామని తెలిపారు.

 

ప్రజాప్రతినిధుల క్రీడలను ఎవరైనా ఉచితంగా వీక్షించవచ్చని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి స్పష్టం చేశారు. వీక్షకుల సౌకర్యాలకు సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్టేడియంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *