కేరళ శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య మాటలు తీవ్రమయ్యాయి. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కమ్యూనిస్టులు కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపణలు గుప్పించారు.
కేరళలో శాసనసభ ఎన్నికల వేడి.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
కేరళంలో శాసనసభ ఎన్నికల శంఖారావం పూరించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య ముప్పులా మారిందన్నారు. డ్రగ్స్ కేసుల్లో కేరళ రెండో స్థానంలో ఉందన్నారు. దీనికి ప్రభుత్వ ఉదాసీనతే కారణమని ఘాటుగా విమర్శించారు. కోళికోడ్ బీచ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభను ఉద్దేశించి ఆన్‌లైన్‌ద్వారా రాహుల్‌గాంధీ మాట్లాడారు.
శబరిమలలో కిలోల కొద్దీ బంగారం మాయమైందని ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులో స్వయంగా అధికార సీపీఎం నేత అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. సాక్షాత్తు అయ్యప్పస్వామిని గౌరవించని అధికార ప్రభుత్వం, ప్రజలను ఎలా గౌరవిస్తుందని ప్రశ్న సంధించారు. కేరళలో రెండు కూటముల మధ్య పోటీ జరుగుతోందన్నారు. యూడీఎఫ్-ఎల్ డీఎఫ్ మధ్య పోటీ ఉందన్నారు.
కోజికోడ్ వేదికగా యూడీఎఫ్ ఎన్నికల ప్రచారం.. బీజేపీతో కమ్యూనిస్టుల దోస్తీ-రాహుల్
అయితే ఎల్‌డీఎఫ్-బీజేపీ కూటమని తేల్చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. తనపై 40 కేసులు పెట్టారని, ఐదు రోజులపాటు ఈడీ తనను విచారించిందన్నారు. ప్రతి రోజూ ప్రతి సెకనూ అధికార ప్రభుత్వం తనను వేధిస్తోందని ఆరోపించారు.
అలాంటి బీజేపీ.. ఎన్నో కేసులున్న కేరళ సీఎంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నలు సంధించారు. ప్రజలకు తాము జవాబుదారీ కాదని లెఫ్ట్-బీజేపీ భావిస్తున్నాయని అన్నారు. వాటి విధానాలు, రాజకీయ ఎజెండా ఒకటేనన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పలేదని, ఎల్‌డీఎఫ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కొందరు లెఫ్ట్ అభ్యర్థులు ఈ విషయాన్ని చెబుతున్నారని తెలియజేశారు.
కేరళం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా UDF కూటమి వరాల జల్లు కురిపించింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాలేజీలకు వెళ్లే ప్రతి విద్యార్థినికి నెలకు రూ.1000 ఆర్థిక సాయం చేయనుంది. అంతేకాదు సంక్షేమ పింఛన్లను రూ.3 వేలకు పెంచాలని డిసైడ్ అయ్యింది.
ప్రతి ఇంటికీ వెళ్లి యూడీఎఫ్ గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని సూచనలు చేశారు రాహుల్ గాంధీ. ఎన్నికలు యువత భవిష్యత్తు, ఉపాధి, కేరళం లౌకికత్వాన్ని కాపాడేందుకేనని వెల్లడించారు. అప్పుల బాధలు, డ్రగ్స్ మహమ్మారి, ఆరోగ్య వ్యవస్థకు ఏప్రిల్ 9న సమాధానం చెప్పాలని పిలుపు నిచ్చారు.