ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక-99 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయడమేగాక, ఖాళీగా ఉన్న ఇండ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశాల్లో బుధవారం సుమారు 22 మంది శాసనసభ్యులు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
టోల్ ఫ్రీ నంబర్, సమస్యల పరిష్కారం
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా త్వరలో ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సభ్యులు తమ దృష్టికి తెచ్చిన అంశాలతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను పరిష్కరించేందుకు కొద్ది రోజుల్లో ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. వీటి ద్వారా వచ్చే ప్రశ్నలకు 24 గంటల్లోగా సమాధానం చెప్పడమేగాక వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మౌలిక సదుపాయాల కల్పన
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మూడు విభాగాలుగా సమస్యలను విభజించి పరిష్కరించడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 2 లక్షల పైచిలుకు ఇండ్లను మంజూరు చేసి హైదరాబాద్ కు లక్ష ఇండ్లను కేటాయించగా వీటిలో 78,861 ఇండ్లు పూర్తయినా మౌలిక సదుపాయాలకు నోచుకోలేదన్నారు. 21,838 ఇండ్లు కేవలం పునాదులకే పరిమితమయ్యాయని మంత్రి పొంగులేటి విమర్శించారు.
రూ.738 కోట్లతో మౌలిక సదుపాయాలు
జీహెచ్ఎంసీ పరిధిలో 26 కాలనీలు అసంపూర్తిగా ఉండిపోయాయని, తాము కొత్తగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు చేశామని వివరిస్తూ రూ.738 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. తాము ఎటువంటి భేషజాలకు పోకుండా గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 92 వేల ఇండ్లలో 62 వేల ఇండ్లు పూర్తి చేశామని చెప్పారు. 2023 ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం 23,500 ఇండ్లను కేటాయించిందని, అయితే నగరంలో వృత్తి వ్యాపారాలు చేసుకునే వారు సమారు 20-30 కిలోమీటర్ల దూరంలో కేటాయించిన ఇండ్లలోకి రాలేదన్నారు.
ఖాళీ ఇళ్ల కేటాయింపుపై కొత్త నిబంధన
ఫలితంగా 12 వేలకు పైగా ఇండ్లు ఖాళీగా ఉండిపోయాయని వివరించారు. దీనిపై ఉన్నతాధికారులు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో మూడుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించామన్నారు. లబ్ధిదారులకు మరో అవకాశాన్ని కల్పిస్తూ 2 నెలల్లోగా వీటిలో గృహప్రవేశాలు చేయాలని నోటీసులు ఇచ్చామని మంత్రి వివరించారు. ఒకవేళ వారు రాలేకపోతే సుమారు 5-10 కిలోమీటర్ల పరిధిలో ఉండే అర్హులైన పేదలకు కేటాయించేందుకు నిర్ణయించామని పొంగులేటి తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొత్త కేటాయింపులు పూర్తి చేస్తామని తెలిపారు.
జర్నలిస్టు కాలనీలు – బడ్జెట్ కేటాయింపులు
2017లో చేపట్టిన కాలనీలకు మౌలిక సదుపాయాలకు సంబంధించి గతంలో రూపొందించిన ఎస్టిమేషన్లు రద్దుచేస్తూ జీవో ఇచ్చామని, అదేవిధంగా జర్నలిస్టుల కాలనీలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 80 కాలనీలకు మౌలిక సదుపాయాల కోసం రూ.784 కోట్లు మంజూరు చేశామని, వీటిలో సుమారు రూ.432 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. మిగిలిన మొత్తంతో పాటు మరో రూ.270 కోట్ల వరకు అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత
రాష్ట్రంలో తొలి విడుతగా 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేస్తూ ప్రత్యేకంగా చెంచులకు, ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు 12వేల ఇండ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. వివిధ కాలనీల్లో షాపులకు సంబంధించి లీజుకు ఇస్తే వారు సక్రమంగా అద్దెలు చెల్లించడం లేదనన్నారు. పైగా కోర్టులకు వెళ్తున్నందన అద్దెలు వసూలు కావడం లేదన్నారు. ఈ పరిస్ధితుల్లో సదరు షాపులను బహిరంగ వేలంలో విక్రయించి వచ్చిన డబ్బును ఆయా కాలనీ కమిటీ, ప్రభుత్వం పేరిట జమచేసి వాటిపై వచ్చే వడ్డీతో విద్యుత్, లిఫ్ట్ తదితర అవసరాలుకు ఖర్చు చేసేలా ప్రతిపాదించామని తెలిపారు.
మార్చి 31 నాటికి గృహ ప్రవేశాలు
గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ఇంతవరకు కేటాయించని ఇండ్లకు సంబంధించి పాత కాంట్రాక్టర్లు అప్పటి రేటుకు సమ్మతిస్తే వారికి పనులు అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలో ఈ మార్చి 31 నాటికి సుమారు 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలు జరగనున్నాయని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు. వచ్చే జూన్ నాటికి మరో లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
ఏప్రిల్‌లో రెండో విడుత మంజూరు
ఏప్రిల్‌లో రెండో విడుత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. గతంలో గృహలక్ష్మి పథకం కింద ప్రారంభించి అసంపూర్తిగా ఆగిపోయిన ఇండ్లకు నిధులు ఇస్తామని దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ఇప్పటికే 14-15 స్థలాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లోని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ముఖ్య పట్టణాల్లో కూడా ఇదే పద్ధతిని అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.