శ్రీరామనవమి పర్వదినానికి ముందే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం భక్తులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత పాలకుల హయాంలో వేదనకు గురైన ఈ క్షేత్రం నేడు అభివృద్ధి బాటలో పయనిస్తోంది. రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ బుధవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు రూ. 3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ఈ 3.70 కిలోమీటర్ల బీటీ రోడ్డును ఆయన భక్తులకు అంకితం చేశారు.
హిందూ ధర్మ పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం:
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆలయాల పవిత్రతను కాపాడటంతోపాటు హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రామతీర్థం క్షేత్రం రామాయణ మహాభారత కాలం నాటి ఆనవాళ్లు కలిగిన అత్యంత పవిత్రమైన ప్రదేశమని కొనియాడారు. వైకుంఠ ఏకాదశి, శివరాత్రి వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు బోదికొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని.. గతంలో ఈ మార్గం రాళ్లు, రప్పలు, ముళ్ల కంపలతో నిండి భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగించేదని గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి విన్నపం మేరకు యుద్ధ ప్రాతిపదికన ఈ రహదారిని పూర్తి చేసి శ్రీరామనవమికి రెండు రోజుల ముందే అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో జరిగిన రాములవారి విగ్రహ శిరచ్ఛేదం ఘటనను పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగంతో స్మరించుకున్నారు. ఆ ఘటన కోట్లాది మంది హిందూ భక్తులతోపాటు తనను కూడా తీవ్ర వేదనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి బాధను తుడిచివేస్తూ.. నేడు అదే స్వామివారి క్షేత్రంలో గిరిప్రదక్షిణ మార్గాన్ని సుందరంగా నిర్మించి సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. దేవాలయాల అభివృద్ధిని కేవలం మాటలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
గడిచిన 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట వేసిందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్ నిధుల నుంచి సుమారు రూ. 40 కోట్లు వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు వసతి కల్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికే శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చామని.. కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆలయాల పవిత్రతను దెబ్బతీసే చర్యలను సహించబోమని.. సంస్కృతి సంప్రదాయాలను కాపాడటమే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఉద్ఘాటించారు.
ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. హోం మంత్రి వంగలపూడి అనిత.. కొండపల్లి శ్రీనివాస్.. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. ఎమ్మెల్యేలు లోకం మాధవి.. పూసపాటి అదితి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గం అందుబాటులోకి రావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.