తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం భారత రాష్ట్ర సమితి కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ.. ఈ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ బిల్లుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అభయహస్తం మేనిఫెస్టోలోని అంశాలను చట్టంగా మార్చడం ద్వారానే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఆరు గ్యారెంటీల ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారని.. వారం తర్వాత గవర్నర్ ప్రసంగంలోనూ అదే విషయాన్ని నొక్కి చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి 840 రోజులు గడిచినా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో అతిపెద్ద ఫ్రాడ్ అని మండిపడ్డారు. ఓట్ల కోసం కోటి మోసాలు చేస్తూ తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు టోపీ పెట్టారని విమర్శించారు. ఈ మోసపూరిత వైఖరిని ఎండగట్టడానికే తమ పార్టీ తరపున సీనియర్ నాయకులు.. న్యాయ నిపుణులతో చర్చించి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును సిద్ధం చేసినట్లు తెలిపారు.
వచ్చే శుక్రవారం అసెంబ్లీ.. కౌన్సిల్ ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. గతంలో 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేత విద్యాసాగర్ రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి చట్టం చేసిన ఉదంతాన్ని ఆయన ఉదహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తాము ప్రతిపాదించే బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రజలకు చట్టబద్ధమైన హక్కు లభిస్తుందని.. తద్వారా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే కోర్టు ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టంగా మారితే రైతులకు రైతు భరోసా.. మహిళలకు రూ. 2,500 మహాలక్ష్మి పథకం.. వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ వంటివి తప్పనిసరిగా అందుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఎంత బాధ్యతో.. ఈ పథకాల అమలు కూడా అంతే బాధ్యతగా మారుతుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలోనే గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యముంటే పోలీసు బలగాలు లేకుండా అశోక్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలతో చర్చకు రావాలని సవాల్ విసురుతూ.. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు