తిరుమలలో రూ.25 కోట్లతో.. అద్భుతమైన హై-టెక్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భక్తులకు అత్యంత నాణ్యమైన ప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులను ఆదేశించారు. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ (FSSAI) సహకారంతో టీటీడీ రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్ – ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. దేశంలో ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాల ల్యాబ్ ఇదే కావడం విశేషం. ప్రారంభోత్సవం అనంతరం ల్యాబ్‌లోని ప్రతి విభాగాన్ని సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు.

 

ల్యాబ్ పనితీరుపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యత విశ్లేషణపై ఆరా తీశారు. సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కెమికల్ విభాగం సహా మైక్రోబయాలజీ విభాగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆహార పదార్థాల రుచిని గుర్తించే e-tongue పరికరంతో పాటు వాసనను విశ్లేషించే e-nose వంటి అధునాతన టెక్నాలజీని ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. ఇవి డిజిటల్ పద్ధతిలో ఆహార నాణ్యతను ఖచ్చితంగా లెక్కగడతాయని అధికారులు వివరించారు. 1981లో చిన్నదిగా మొదలైన ఈ విభాగం నేడు నెలకు 1,500 శాంపిళ్లను పరీక్షించే స్థాయికి ఎదగడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

 

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి స్వచ్ఛతపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. కల్తీని పూర్తిగా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. NDDB సంస్థ విరాళంగా ఇచ్చిన GC/HPLC యంత్రాల ద్వారా నెయ్యి నాణ్యతను శాస్త్రీయంగా నిర్ధారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2025 జూలై నుంచి నెయ్యి పరీక్షలను మరింత విస్తృతం చేశామని దీనివల్ల కల్తీకి తావుండదని వివరించారు. ముడి పదార్థాల్లో ఉండే పురుగు మందుల అవశేషాలు అలాగే ఆర్సినిక్ వంటి భారీ లోహాలను గుర్తించే పరికరాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి.

 

బ్యాక్టీరియా గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన క్లీన్ రూమ్ తో పాటు ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రసాదాల విషయంలో భక్తులకు ఉండే అచంచలమైన విశ్వాసాన్ని కాపాడటం అధికారుల ప్రథమ కర్తవ్యమని గుర్తు చేశారు. ల్యాబ్ పరీక్షలతో పాటు అన్నప్రసాద కేంద్రాల శుభ్రతను నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. తిరుమలలో అమలు చేస్తున్న ఈ ఫుడ్ సేఫ్టీ చర్యలు దేశంలోని ఇతర ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తాయని సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు టీటీడీ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *