సిద్దిపేటలో రైతు మేళా.. వరి వద్దు.. ఆయిల్ పామ్ ముద్దు.. మంత్రుల పిలుపు..

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ‘రైతు మేళా ఘ‌నంగా ప్రారంభ‌మైంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, హ‌రీష్ రావు, ర‌ఘునంద‌న్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయిల్ పామ్ సాగు ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించారు.

 

ఆయిల్ పామ్ రైతు గుండెచప్పుడు..

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగును తన 45 ఏళ్ల కలగా అభివర్ణించారు. గతంలో ఎన్టీఆర్ ఒక మొక్కను నాటడం ద్వారా ప్రారంభమైన ఈ ప్రస్థానం.. నేడు సిద్దిపేటలో అత్యాధునిక ఫ్యాక్టరీ ఏర్పాటు వరకు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు తన తోటను సందర్శించిన తర్వాతే ఈ ప్రాంతంలో సాగుపై ఆలోచన చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై నిక్కచ్చిగా ఉన్నందున, రైతులు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ వైపు మళ్లాలని సూచించారు. దేశంలో రిఫైనరీల కొరత ఉందని, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.

 

రైతు మేలు కోసమే ఈ ఫ్యాక్టరీ..

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా రైతులు ఆయిల్ పామ్ సాగుతో పొందుతున్న ఆర్థిక ప్రయోజనాలే ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్ఫూర్తి అని తెలిపారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల గాలిలో పెరిగిన తేమ శాతం ఈ సాగుకు అనుకూలంగా మారిందని వివరించారు. 2021లో కేసీఆర్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల రూ. 300 కోట్లతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందని, దీనివల్ల సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి, ప్రభుత్వం మారినా మంత్రి తుమ్మల ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించడం అభినందనీయమని పేర్కొన్నారు.

 

సబ్సిడీల కోసం కృషి..

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రం రావాలని ప్రొఫెసర్ జయశంకర్ ఎలా కలలు కన్నారో, ఆయిల్ పామ్ సాగు కోసం తుమ్మల నాగేశ్వరరావు కూడా అలాగే తపించారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా లక్ష కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంటోందని, దీన్ని అరికట్టాలంటే స్వదేశీ సాగు పెరగాలని పిలుపునిచ్చారు. అర ఎకరం ఉన్న రైతు కూడా ఈ సాగు చేసేలా కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అదనపు సాయం అందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.

 

సాంకేతిక సాగు అవసరం..

తాను స్వయంగా 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ సాగులో ప్రధానంగా వచ్చే ‘పెండ పురుగు’ సమస్యను సరైన యాజమాన్య పద్ధతులతో పరిష్కరించుకోవచ్చని రైతులకు సూచించారు. ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలని హితవు పలికారు. దిగుమతి తగ్గుముఖం పట్టడం వల్ల దేశానికి లక్ష కోట్ల విదేశీ మారకం మిగులుతుందని, వరి సాగు కంటే ఆయిల్ పామ్ ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివరించారు.

 

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం..

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ‘నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ. 4,200 ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో ఈ సాగు జరుగుతోందని, దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారని వెల్లడించారు. 2014 తర్వాత ప్రధాని మోదీ నాయకత్వంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత పెరిగిందని, రైతు ఏడాదంతా ప్రశాంతంగా ఉండాలంటే ఈ సాగు ఉత్తమమని అభిప్రాయపడ్డారు.

 

హుస్నాబాద్‌లో సాగు పెంపు..

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీని అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. సిద్దిపేట కంటే ఎక్కువగా తన నియోజకవర్గమైన హుస్నాబాద్‌లో ఈ సాగును పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆయిల్ పామ్ సాగులో మంత్రి తుమ్మల కృషిని కొనియాడుతూ, ఆయనను ఈ రంగంలో ‘కురియన్’ (క్షీర విప్లవ పితామహుడు) వంటి వారని వర్ణించారు.

 

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. కోతుల బెడద, వడగళ్ల వర్షాల వల్ల కలిగే నష్టాల నుంచి బయటపడాలంటే ఆయిల్ పామ్ సాగు సరైన పరిష్కారమని అన్నారు. ప్రభుత్వం రుణమాఫీ ద్వారా రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు రావడం వల్లే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిందని, ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కోసం మరిన్ని నిధులు కేటాయిస్తే రైతులు అధికంగా ముందుకు వస్తారని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *