తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై అన్నాడీఎంకే చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఆ పార్టీ ఎంపీ సీవే షణ్ముగం నటి నయనతారను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారానికి దారితీశాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ చేపట్టిన ‘ప్రజల కలల’ కార్యక్రమాన్ని ఎద్దేవా చేసే క్రమంలో, “నాకు నయనతారను కలవాలని ఉంది.. నా కోరికను సీఎం తీరుస్తారా?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి.
విల్లుపురం జిల్లాలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీ షణ్ముగం మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం కలలు కనమంటే, స్టాలిన్ ప్రజల కలలను నెరవేరుస్తామని అంటున్నారని, మరి ఎవరైనా నయనతారతో పెళ్లి చేయమని అడిగితే ఆయన చేస్తారా అంటూ అభ్యంతరకర పోలికలు తెచ్చారు. మహిళల గౌరవం కోసం పోరాడుతున్నామని చెబుతూనే, ఒక మహిళా నటిని ఇలా బహిరంగంగా కించపరచడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ మాట్లాడుతుంటే పక్కనే ఉన్న ఇతర నాయకులు నవ్వుతూ మద్దతు తెలపడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై అధికార డీఎంకే పార్టీ ఘాటుగా స్పందించింది. రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ, ఇలా మహిళలను కించపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని డీఎంకే ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా అన్నారు. నయనతారను అవమానించడం అంటే మహిళలందరినీ అవమానించడమేనని, అన్నాడీఎంకే వెంటనే షణ్ముగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదంపై అన్నాడీఎంకే అధికారికంగా స్పందించనప్పటికీ, ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని ఒక ప్రతినిధి పేర్కొన్నారు.