పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఆటంకాలు కలుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు ఇబ్బంది కలగకుండా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనివల్ల గ్యాస్ కొరత ఉన్నా చిన్నారులు, గర్భిణులు, మరియు బాలింతలకు అందించే పౌష్టికాహారం తయారీలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్’ కింద ఈ స్టవ్‌ల పంపిణీ జరుగుతోంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) ఇప్పటికే తొలి విడతలో 11,400 ఇండక్షన్ స్టవ్‌లను సరఫరా చేయగా, మిగిలిన 44,346 స్టవ్‌లను కూడా యుద్ధ ప్రాతిపదికన అంగన్‌వాడీలకు చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా, విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన EESL దీనికి సాంకేతిక సహకారం అందిస్తోంది.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం హోటళ్లు, హాస్టల్స్ మరియు క్యాటరింగ్ రంగాలపై తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల వ్యాపారులు కట్టెల పొయ్యిలను వాడుతుండగా, మరికొందరు ధరలు పెంచేస్తున్నారు. అయితే, ఈ గ్యాస్ సంక్షోభం అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విద్యుత్ పరికరాల వైపు మొగ్గు చూపింది. ఇండక్షన్ స్టవ్‌ల వాడకం వల్ల ఇంధన ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణ హితమైన వంట పద్ధతులకు కూడా ఊతం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.