పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ: ‘కాంగ్రెస్ మునిగిపోయే పడవ’.. కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ వైపు మొగ్గు?

గత కొంతకాలంగా తాను బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌ను “మునిగిపోయే పడవ”తో పోల్చారు. అలాంటి పార్టీలోకి తాను వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనకు 73 ఏళ్ల వయసని, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానిస్తూనే, క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని పరోక్షంగా బీఆర్ఎస్‌పై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో మల్లారెడ్డి చిన్న కోడలు ప్రీతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను, ముఖ్యంగా జాతీయ విద్యా విధానాన్ని (NEP) ప్రశంసించడం గమనార్హం. అంతేకాకుండా హైదరాబాద్ పేరును ‘భాగ్యనగరం’గా మార్చాలనే డిమాండ్‌ను ఆమె తెరపైకి తీసుకువచ్చారు. గతంలో ఆమె కేంద్రమంత్రి బండి సంజయ్‌ను కలవడం మరియు తనకు ఎంపీగా పోటీ చేయాలని ఉందని ఆసక్తి కనబరచడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్ వైపు వెళ్తుందనే ప్రచారం ఒకవైపు జరుగుతుండగా, ప్రీతిరెడ్డి బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సరికొత్త చర్చకు దారితీసింది. మల్లారెడ్డి గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలవడం వల్ల ఆయన హస్తం పార్టీ వైపు చూస్తున్నారని అందరూ భావించారు. అయితే తాజాగా కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ భావజాలాన్ని ప్రతిబింబించేలా మాట్లాడటంతో, మల్లారెడ్డి కుటుంబం భవిష్యత్తులో కమలం గూటికి చేరుతుందా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *