టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిరకాల స్నేహితురాలు వన్షికతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ హిల్‌స్టేషన్ ముస్సోరీ వేదికగా ఈ వివాహ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ శుభకార్యంలో పాల్గొనేందుకు టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ శనివారం డెహ్రాడూన్ చేరుకున్నాడు. కుల్దీప్ పెళ్లి వేడుకలను ఆస్వాదించిన అనంతరం నేరుగా ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొంటానని, దేశం కోసం మరిన్ని ట్రోఫీలు గెలవడమే తమ అంతిమ లక్ష్యమని ఈ సందర్భంగా తిలక్ వర్మ పేర్కొన్నాడు.
ముస్సోరీలోని చారిత్రాత్మక ‘వెల్కమ్ హోటల్ ది సవోయ్’లో జరుగుతున్న ఈ వేడుకల్లో ఇప్పటికే సంగీత్ కార్యక్రమం ముగిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వధూవరులు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతుండగా, సహచర క్రికెటర్లు వారిని ఆశీర్వదించారు. ముఖ్యంగా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, యుజ్వేంద్ర చాహల్ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ వివాహ వేడుకకు క్రికెట్ ప్రపంచం నుంచి ప్రముఖులు క్యూ కట్టారు. తిలక్ వర్మ కంటే ముందే సురేశ్ రైనా, రింకూ సింగ్, మహ్మద్ కైఫ్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ హాజరయ్యారు. వీరితో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మ రాకతో ముస్సోరీలో క్రికెట్ సందడి మరింత నెలకొంది.