ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ హెల్పర్లకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్ పోస్టుల్లో 50 శాతం పోస్టులను అర్హులైన హెల్పర్లకే పదోన్నతి (ప్రమోషన్) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి సహాయకులుగా పనిచేస్తున్న వేలాది మంది మహిళలకు వృత్తిపరమైన గుర్తింపుతో పాటు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
ఈ పదోన్నతి పొందాలంటే హెల్పర్లు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండటంతో పాటు కనీసం ఐదేళ్ల సర్వీసును పూర్తి చేసుకుని ఉండాలి. నియామక సంవత్సరంలో జూలై 1వ తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 50 ఏళ్లు మించకూడదని నిబంధన విధించారు. దరఖాస్తు చేసుకునే హెల్పర్లు సదరు వార్డు లేదా గ్రామానికి చెందిన వారై ఉండాలి. సీనియారిటీ, విద్యార్హతలు మరియు ఫిట్‌నెస్ ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ప్రభుత్వ రిజర్వేషన్లు కూడా కచ్చితంగా పాటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మినీ కార్యకర్తలు అంగన్‌వాడీ టీచర్లుగా పదోన్నతి పొందుతారు. ఫలితంగా వారి వేతనం ప్రస్తుతం ఉన్న రూ. 7,000 నుండి రూ. 11,500 కు పెరగనుంది. ఈ మార్పుల వల్ల అంగన్‌వాడీ వ్యవస్థ మరింత బలోపేతం అవ్వడమే కాకుండా, గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని అధికారులు వెల్లడించారు.