ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడుతోంది. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వంట గ్యాస్ సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో రీఫిల్ బుకింగ్ కోసం ఉన్న 21 రోజుల గ్యాప్‌ను ఇప్పుడు 25 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ అందుకున్న తర్వాత తదుపరి బుకింగ్ చేసుకోవడానికి కనీసం 25 రోజుల సమయం పడుతుంది.
సకాలంలో సిలిండర్ అందకపోయినా లేదా డీలర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నా, వినియోగదారులు నేరుగా గ్యాస్ కంపెనీల హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 7718955555 నంబర్లను సంప్రదించవచ్చు. భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 లేదా 7715012345 కు కాల్ చేసి తమ సమస్యను తెలియజేయవచ్చు. అలాగే HP గ్యాస్ వాడుతున్న వారు 1800-2333-555 లేదా 9493602222 నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వినియోగదారులు అన్వేషిస్తున్నారు. ఇండక్షన్ స్టవ్‌లు మాత్రమే కాకుండా, సోలార్ కుక్కర్లు లేదా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వంటి ప్రత్యామ్నాయాలు ఇప్పుడు ఉపయోగకరంగా మారుతున్నాయి. డీలర్ల వైపు నుంచి ఏదైనా ఇబ్బంది ఎదురైతే పైన పేర్కొన్న టోల్-ఫ్రీ నంబర్లను సంప్రదించి సకాలంలో గ్యాస్ పొందేలా చర్యలు తీసుకోవచ్చు.