లోక్ సభ ఎన్నికల్లో పొత్తులుండవ్.. ఒంటరిగానే బరిలోకి..

లోక్ సభ ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చేశారు. ఒంటరిగానే బరిలో ఉంటామన్నారు. ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారన్నారు. వికసిత్ భారత్, విశ్వకర్మ పథకాలపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయాత్తంకావడం ,కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.

 

తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో సమానంగా పోరాటాలుంటాయన్నారు. తెలంగాణ బీజేపీకి రాజకీయంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సర్వే సంస్థలకు సైతం అంచనాకు అందని ఫలితాలు వస్తాయన్నారు.

 

రాష్ట్రంలో రేపటి నుంచి వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారని వెల్లడించారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకుంది. జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. కానీ ఆ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేదు. 7 స్థానాల్లో కనీసం 5 వేల ఓట్లు కూడా లేదు. ఒక్క కూకట్ పల్లిలో మాత్రమే జనసేనకు దాదాపు 39 వేల ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ మాత్రం 8 స్థానాల్లో గెలిచింది. మరో నాలుగునెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒంటరి పోటీకే బీజేపీ మొగ్గుచూపుతోంది. మరి ఏపీలో బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇవ్వాల్సిఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *