తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వీరు పార్టీ మారారనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది.
స్పీకర్ వెలువరించిన ఈ తీర్పుపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసిన విషయం జగమెరిగిన సత్యమని, అటువంటిది సాక్ష్యాధారాలు లేవని చెప్పడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని విపక్ష నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, ఈ అనర్హత పిటిషన్ల అంశం రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు స్పీకర్ తీర్పుపై దానం నాగేందర్ స్పందిస్తూ.. న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. తనపై కొందరు కక్షపూరితంగానే ఇటువంటి ఫిర్యాదులు చేశారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా తాను సిద్ధమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయంతో అనర్హత వేటు గండం నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు.